కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు పట్టాలు పొందిన లబ్ధిదారుల సమగ్ర వివరాలను మండల స్థాయి అధికారులు సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మండల స్థాయి అధికారులతో గిరి వికాసం పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు నుంచి అయిదుగురు వరకు ఈ పథకంలో లబ్ధిదారులు ఉండవచ్చని తెలిపారు. లబ్ధిదారుల భూమి ఐదెకరాల వరకు ఉండాలని చెప్పారు. లబ్ధిదారులకు విద్యుత్ సౌకర్యం, సాగునీటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లబ్ధిదారులు విద్యుత్ సౌకర్యం కోసం మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా చూడాలన్నారు. పోడు భూములు సాగులోకి వచ్చే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా భూగర్భ జలాల అధికారి సతీష్ యాదవ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.