డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి విశ్వవిద్యాలయంలో జరిగిన న్యాక్ సన్నాహక సమావేశంలో తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, బోధన సిబ్బంది, పరిశోధకులకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణకు, ల్యాబ్‌ల ఏర్పాట్లకు విద్యార్థుల ఫెలోషిపులకు న్యాక్ గుర్తింపు అనివార్యమైందని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని రిజిస్ట్రార్ తెలిపారు. ఈ గుర్తింపు ద్వారానే విశ్వవిద్యాలయాలకు భవన నిర్మాణ గ్రాంట్లతో పాటు మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక మద్దతు పొందవచ్చునన్నారు.
సన్నాహక సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రధానంగా ఏ క్యూ ఏ ఆర్ రూపకల్పన గురించి సమగ్రంగా అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఏ క్యూ ఏ ఆర్ ను ఏవిధంగా సిద్ధం చేయాలో అధ్యాపకులతో చర్చించి వారికి సంపూర్ణ అవగాహన కల్పించి దాని రూపకల్పనలో పరిగణంలోకి తీసుకోవాల్సిన అంశాలపై మార్గ నిర్దేశనం చేశారు. ఏ క్యూ ఏ ఆర్ లోని ఏడు ప్రమాణాలైనా కర్క్యులం అస్పెక్ట్స్, టీచింగ్ లెర్నింగ్ ఎవల్యూషన్, రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎక్స్టెన్షన్, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లెర్నింగ్ రిసోర్సెస్, స్టూడెంట్ సపోర్ట్, గవర్నెన్స్ లీడర్షిప్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ గురించి క్షుణ్ణంగా వివరించి ఒక్కో ప్రమాణ బాధ్యతను ఒక్కో అధ్యాపకునికి అప్పగించారు.
అధ్యాపకులు అందరూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగం పంచుకునే క్రమంలో ఉన్నతమైన న్యాగ్రేడ్ పొందడం అవసరమని రిజిస్టార్ పేర్కొన్నారు. న్యాక్ గ్రేడ్ పొందడం కోసం బోధన బోధనేతర సిబ్బంది తమ శక్తి వంచన లేకుండా విధిగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.