పరస్పర సహకారంతో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ హితవు పలికారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభాయాత్ర, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

వేడుకల నిర్వహణ తీరుతెన్నుల గురించి ఇరు మతాల పెద్దలు, కమిటీ సభ్యులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఏర్పాట్ల గురించి వారికి వివరించారు. జిల్లా కేంద్రంలో మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీని ఒక రోజు తరువాత నిర్వహించుకోవాలని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా మిగతా అన్ని జిల్లాలలో నిమజ్జనం మరుసటి రోజున జరుపుకునేందుకు నిర్ణయించారని కలెక్టర్‌, సీ.పీ సూచించారు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నందున 28 వ తేదీనే మిలాద్‌-ఉన్‌-నబీ జరుపుకుంటామని కమిటీ ప్రతినిధులు జిల్లా అధికారులను కోరారు.

వారి అభ్యర్థనను ఆమోదించిన కలెక్టర్‌, మధ్యాహ్నం 12.00 గంటల లోపు ర్యాలీ ముగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలుగకుండా సంయమనం పాటించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అన్నారు.

గణేష్‌ నిమజ్జనానికి సంబంధించి గత ఏడాది ఖరారు చేసిన రూట్‌ మ్యాప్‌ ప్రకారంగానే ఈసారి కూడా ఆ మార్గాల మీదుగానే శోభాయాత్ర కొనసాగుతుందని కలెక్టర్‌ తెలిపారు. అయితే బాసర వెళ్లే మార్గంలో జన్నెపల్లి క్రాస్‌ రోడ్‌, జానకంపేట్‌ వద్ద రెండు చోట్ల రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ హై వోల్టేజ్‌ ఎలక్ట్రిక్‌ లైన్‌ ఉన్నందున 4.5 మీటర్లకంటే ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు వెళ్లేందుకు వీలు లేనందున, ఈ విషయంలో గణేష్‌ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గంగా ఖానాపూర్‌ మీదుగా వెళ్లే సమయంలోనూ పొతంగల్‌, జన్నెపల్లి గ్రామాల వద్ద రెండు చోట్ల స్వాగత తోరణాలు ఉన్నందున 5.5 మీటర్ల ఎత్తు కలిగిన విగ్రహాలు మాత్రమే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పెద్ద విగ్రహాలను చివరి వరుసలో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యమైన రెండు పండుగలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్‌ తెలిపారు.

బాసర వద్ద క్రేన్‌ లతో పాటు, లైటింగ్‌, గజ ఈతగాళ్లు, తాగునీటి వసతి ఇత్యాది సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. సీ.పీ సత్యనారాయణ మాట్లాడుతూ, మిలాద్‌-ఉన్‌-నబీ, వినాయక శోభాయాత్ర సందర్భంగా ప్రతి చోట కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీ.సీ కెమెరాల ద్వారా పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఇరు మతాల పెద్దలు కూడా పర్యవేక్షణ జరపాలన్నారు.

సహృద్భావ వాతావరణంలో ఆనందోత్సాహాలతో పండుగలు జరిగేలా కృషి చేయాలని కోరారు. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో లౌడ్‌ స్పీకర్లు వాడవద్దని, రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, అదనపు డీసీపీ జయరాం, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, సార్వజనిక్‌ గణేష్‌ మండలి ప్రతినిధులు బంటు గణేష్‌, శివకుమార్‌ పవార్‌, వినోద్‌ కుమార్‌ గుప్తా, డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ ఖాన్‌, ఎం.ఐ.ఎం ప్రతినిధులు షకీల్‌, శహబాజ్‌, మత పెద్దలు రఫత్‌ ఖాన్‌, కరీముద్దీన్‌ కమాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వినాయక శోభాయాత్రను ఆద్యంతం పర్యవేక్షించాలి

కాగా, శాంతి కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్‌, సీ.పీలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆయా పాయింట్ల వారీగా జిల్లా అధికారులను ఇంచార్జ్‌ లుగా బాధ్యతలు పురమాయించారు. సదరు అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల మీదుగా శోభాయాత్ర ముగిసేంత వరకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు.

నిమజ్జనోత్సవానికి ఒకరోజు ముందే శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా లోటుపాట్లు, సమస్యలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ పండుగల సందర్భంగా ఎక్కడ కూడా ఏ చిన్న అపశ్రుతి నెలకొనకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. ముఖ్యంగా షార్ట్‌ సర్క్యూట్లతో విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.

అలాగే చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆయా ప్రదేశాల్లో అంబులెన్స్‌ లను ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తిన తక్షణమే తమ దృష్టికి తేవాలని కలెక్టర్‌ సూచించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »