కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్రోద్యమ సాధనలో , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా బాపూజీని అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, బీసీ సంఘాల నాయకులు శివ రాములు, ఎంజి వేణుగోపాల్ గౌడ్, రాజయ్య, మల్లయ్య, శ్రీహరి, పోచవ్వ, అధికారులు పాల్గొన్నారు.