నిజామాబాద్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు కలెక్టర్ కు స్వాగతం పలికారు.
జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ దండు నీతూ కిరణ్, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాం, మాజీ శాసన సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ తదితరులు సైతం కలెక్టర్ తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అక్కడే గల బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి సార్వజనిక్ మండలి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళుర్పించారు.
అనంతరం జెండా ఊపి శోభాయాత్ర రథాన్ని ప్రారంభించారు. చంద్రయాన్-3 నమూనాను అనుసరిస్తూ, అందంగా అలంకరించిన సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. నిమజ్జనోత్సవం సజావుగా సాగేలా పర్యవేక్షణ జరపాలని తన వెంట ఉన్న అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.