కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో భరోసా పథకం కింద కుట్టుమిషన్లను ఇస్తున్నారని తెలిపారు.
మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. మైనారిటీలు అన్ని వర్గాల ప్రజలతో చదువులో రాణించాలని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. వీటి ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేసి పౌష్టికాహారం, దుస్తులు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
పేద మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి రూ. 20 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. మైనార్టీ యువతులకు షాదీ ముబారక్ పథకం కింద ప్రభుత్వం రూ.1,116 ఆర్థిక సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మసీదులు, ఈదుగాల అభివృద్ధికి రూ. కోటి పది లక్షల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. మహిళలు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఇంతియా ఇసాక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.