కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార శాఖలో 31 సంవత్సరాల పాటు పనిచేసి శనివారం పదవి విరమణ పొందుతున్న మూర్తి రమేష్ బాబు సేవలు మరువలేనివని జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతి కుమార్ అన్నారు. రమేష్ బాబు పదవి విరమణ సందర్భంగా శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో రమేష్ బాబు దంపతులను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి కాలంలో ప్రొజెక్టర్ల ద్వారా గ్రామాలలో డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించడంలో, ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాట్లలో వారి సేవలు మరువలేనివని అన్నారు. ఇప్పటికి సమాచార శాఖ అంటే గ్రామాలలో ప్రగతి పదం వాహనం ద్వారా సినిమాలు చూపించే శాఖగా, గ్రామా పంచాయతీలో రేడియో వినిపించే శాఖగా మంచి గుర్తింపు ఉందని అన్నారు. రమేష్ బాబు మొదటగా నిజామాబాద్లో ఆఫీసు సబార్డినేటుగా జాయిన్ అయిన తరువాత కామారెడ్డి, మేడ్చల్ తిరిగి కామారెడ్డిలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ గావిస్తున్నారని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యుల మధ్య గడుపుతారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
వీడ్కోలు సమావేశంలో రమేష్ బాబు శోభ, అన్న మధుసూదన్, కుమారులు సాయి గౌతమ్, సాయి విక్రమ్, కార్యాలయ సిబ్బంది రమేష్ కుమార్, గణేష్, శ్రీనివాస్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.