కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రమశిక్షణతో పెంచి సమాజంలో గౌరవంగా బ్రతికేలా ప్రయోజకులను చేసి వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులను దేవతామూర్తులుగా పూజించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమం, వయోవృద్ధుల శాఖ ఆధ్వరంలో ఆదివారం స్థానిక విద్యానగర్ కాలనీలోని జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి, ప్రపంచానికి దశ,దిశా మార్గనిర్దేశం చేసిన వారు ఈ వయోవృద్దులేనని, వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికీ సేవలు చేయడం ఎంతో మహాభాగ్యమని, మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, క్రమశిక్షణ వల్ల నేనీస్థాయికి ఎదిగానని, వారిని నావద్దే ఉంచుకుని సేవచేస్తున్నానని, ఎంతో ఆత్మసంతృప్తి ఉందని అన్నారు.
ఈ వయస్సులో వారిని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో సంతోషంగా ఉంటారని అన్నారు. పెద్దలు కూడా తమ మనసులో ఉన్న మాటలు పిల్లలకు తెలపాలని, సానుకూల దృకదంతొ మెలగాలని, పెద్ద మనస్సుతో క్షమించాలని, పట్టుదలకు, పంతాలకు పోకుండా సామరస్యంగా మాటల ద్వారా పరిష్కరించుకోవాలని ఏ సమస్యనైనా పరిషక్రించుకోవాలని, అపుడే ఎలాంటి మనస్పర్థలు లేకుండా కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు.
నేటితరం యువతకు వృద్దులు ఐకాన్ లాంటివారని, వారి శేష జీవితం గౌరవప్రదంగా, ఆనందమయంగా గడిపేలా చూడవలసిన బాధ్యత, పోషించవల్సిన బాధ్యత ఉందని అన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేసిన, మానసిక , శారీరక,ఆర్ధిక వేధింపులకు గురిచేసిన, పోషణ, సంరక్షణ బాధ్యతలు విస్మరించిన తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 14567 హెల్డర్ లైన్ ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు.
సీనియర్ సిటిజన్స్ కోరిక మేరకు ఆయుష్ డాక్టర్ల ద్వారా వారంలో రెండు రోజులు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేసేలా చూస్తామన్నారు. . అదేవిధంగా డయాగ్నస్టిక్ కేంద్రంలో నెలకోసారి ఉచితంగా రక్త నమూనా పరీక్షలు చేసేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్‌లను శాలువా, మెమెంటోలతో సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బావయ్య, ఫోరమ్ అధ్యక్షులు విఠల్ రావ్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు రాజన్న, భద్రయ్య, కౌన్సిలర్ లత, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.