నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తడ్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అందులో ప్రధానంగా 61 సంవత్సరాలు వయోపరిమితి జూలై 2018 నుండి అమలు చేయాలని, గ్రాట్యుటీ పెన్షన్ బెనిఫిట్స్ అన్ని జూలై 2018 నుండి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని, 20 సంవత్సరాల సర్వీసు పూర్తి అయినట్లయితే వారికి పూర్తి పెన్షన్ చెల్లించేందుకు పీఆర్సీ సిఫార్సు చేసిందని అదేవిధంగా క్వాంటం ఆఫ్ పెన్షన్, మెడికల్ అలవెన్స్ జూలై 2018నుండి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
సిఎస్, సిఎం కి సిఫార్సు చేయాలని కలెక్టర్‌కి మెమొరాండం ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు జార్జి రావు, లక్ష్మీనారాయణ, హనుమాండ్లు, బేబీ, లక్ష్మణ్, షహీద్ మియా, బాలరాజు, తదితరులు ఉన్నారు.