కామారెడ్డి, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.
శుక్రవారం పిట్లంలోని బోయవాడలో గల ఎంపిపిఎస్ పాఠశాలలో అల్పాహార పధకాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషద్ చైర్ పర్సన్ డఫెదర్ శోభ తో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూ ఆలోచనలు చేస్తుంటారని, వారి మదిలో పుట్టిన మరో మానవీయ కోణ పధకమే సీఎం బ్రేక్ఫాస్ట్ అని అన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండా మధ్యాన్నం వరకు ఆకలితో ఉండడం వల్ల నీరసించి పోయి ఆరోగ్యపరమైన సమస్యలకు కారణమవుతున్నదని, చదువులపై కూడా అంతగా దృష్టిపెట్టడం లేదని, గుర్తించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నియోజక వర్గానికి ఒక పాఠశాల చొప్పున ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నదని అన్నారు.
జిల్లాలో నేడు కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి ఎంపిపిఎస్ పాఠశాల, రామారెడ్డి మండలం ఇష్ణపల్లిలోని ప్రాథమిక పాఠశాల, బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌లోని ఎంపిపిఎస్, పిట్లంలోని బోయవాడు ఎంపిపిఎస్ పాఠశాలల ఈ అల్పాహార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామని వారు తెలిపారు. విద్యార్థుల కోసం వండిన పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ పిల్లలకు ఆప్యాయంగా అల్పాహారం వడ్డించారు.
రోజు ఒక వెరైటీ చొప్పున మెనూ ప్రకారంపోషక విలువలు కలిగిన ఇడ్లి, పూరి, కిచిడి వంటివి రోజు అల్పాహారంగా అందించనున్నామన్నారు. శుచి,శుభ్రత పాటిస్తూ పిల్లలపై చాలా కేర్ తీసుకొని అల్పాహారం అందించాలని నిర్వహుకులకు సూచించారు. పిల్లలు కూడా బాగా చదివి సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆశీర్వదించారు.
కాగా దేవునిపల్లి అల్పాహార పధకాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దీన్, మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, పిప్పిరి ఆంజనేయులు, డీఈఓ రాజు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.