హైదరాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. భర్తీ చేయనున్న ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్ 58, ఎలక్ట్రికల్ 200 ఉండనున్నాయి.