ఎడపల్లి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడారు.
అలాగే జాన్కంపేట్ గ్రామంలోని ఇమేజ్ పాఠశాల, ఎడపల్లిలోని మాధవి, వాగ్దేవి పాఠశాలల్లో విద్యార్థుల తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి ఆకర్షణీయంగా తయారు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయినిలు మాట్లాడుతూ.. తమ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఈ నెల 13 నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా ముందుగానే బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయినిలు, విద్యార్థులు పాల్గొన్నారు.