నిజామాబాద్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత ఖరీఫ్ లో రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల ఎక్కడైనా రైతులు ఆందోళనలకు దిగితే, సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు 2203 రూపాయలు, సాధారణ రకానికి 2183 రూపాయలు మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు.
కాగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని, అధికారులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి మాట్లాడుతూ, ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరిస్తారని అన్నారు.
నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమైనందున ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ చంద్రప్రకాశ్, డీసీఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, డీఆర్డీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు.