కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు నియమించిన అన్ని విభాగాల అధికారులు సమిష్టి భాగస్వామ్యంతో క్రియాశీలకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి, ఎటువంటి ఉల్లంఘనలు చేయరాదని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం, డబ్బు, సరుకుల పంపిణి రవాణా జరిగినప్పుడు ప్రజలు సి బీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. 50 వేలకు మించి ఆధారాలు లేని డబ్బులను స్వాధీనపరచుకోవడం జరుగుతుందన్నారు. 10 లక్షల రూపాయలకు మించి డబ్బు కలిగి ఉంటె ఆదాయపన్ను శాఖాధికారులకు అందజేస్తామన్నారు.
నియోజక వర్గానికి మూడు చొప్పున ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, వారు ఎక్కడ ఫిర్యాదు అందిన తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని అన్నారు. పొలిసు, ఆబ్కారీ శాఖలు చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. సువిధ యాప్ ద్వారా ముందస్తుగా అనుమతులు తీసుకొని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, వీటంతటిని వీడియోగ్రఫీ చేయడం బీజరుగుతుందని అన్నారు.
ఎలాంటి ఒత్తిడిలకు, లొంగకుండా పారదర్శకంగా పనిచేయాలని, ఏ చిన్న తప్పు జరిగిన ఎవరిని వదిలిపెట్టవద్దని, వంద శాతం నిబంధనలు తు.చ. తప్పకుండా అమలు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం వేలెత్తి చూపని విధంగా వివిధ విభాగాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.