కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం కంట్రోల్ రూమ్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని, ఇందుకోసం కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సమాజానికి పెనుప్రమాదంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయవలసి అవసరముందని అన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నష్టపోతారని అన్నారు. నియంత్రణ కోసం పోలీసు, ఆబ్కారీ, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు చిత్తశుద్ధితో కృషిచేయాలని ఆదేశించారు.
మత్తుపదారాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పూర్వ స్థితికి తేవాలని, వారికి పునరావాసం కల్పించాలన్నారు. సమావేశంలో ఆబ్కారీ సూపరింటెండెంట్ రవీంద్ర రాజు, పొలిసు అధికారులు, డిఆర్ డిఓ సాయన్న, జిల్లా సంక్షేమాధికారి బావయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.