నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు విధులు నిర్వహించారన్నారు. కానీ నాలుగు నెలలుగా వారికి వేతనాలు అందడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలు కలిగి ఉన్న మున్సిపల్ కార్మికులకు, అవి కూడా అందకపోవడంతో వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నాయన్నారు.
ఇంటి అద్దెలు చెల్లించడానికి, నిత్యావసర వస్తువులను కొనడానికి అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లకు పెండిరగ్ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వేతనాలు ఇప్పిస్తామని కొందరు అధికారులు, పైరవి కారులు కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిందన్నారు. కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రవికిరణ్, గోపి, రాము, అశోక్, లక్ష్మణ్, రాము, రవి, రాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.