నిజామాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బ్యాంకర్లకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
రూ. పది లక్షలు, అంతకంటే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్, విత్ డ్రా జరిపే వారి వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున, అలాంటి లావాదేవీలను గమనిస్తూ రోజువారీగా వివరాలు సమర్పించాలని అన్నారు. అసాధారణ, అనుమానాస్పద లావాదేవీలను సైతం గుర్తించాలని సూచించారు. అదే సమయంలో వ్యవసాయ పనులు, వ్యాపార అవసరాలకు నగదు లావాదేవీలు జరిపే వారికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు జరుగుతున్నందున బ్యాంకుకు సంబంధించిన నగదు తరలిస్తున్న సమయంలో అన్ని నిబంధనలను పక్కాగా పాటిస్తూ, పూర్తి ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. 40 లక్షలకు మించకూడదని, అభ్యర్థులు ఒకే బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఖాతా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సత్వరమే చెక్ బుక్కు, ఏ.టీ.ఎం డెబిట్ కార్డు వంటి వాటిని సమకూర్చాలని, అభ్యర్థుల నుండి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, బ్యాంకర్లు పాల్గొన్నారు.