బాన్సువాడ, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద ప్రమాదంలో వీర మరణం పొందిన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని అయన స్వగృహంలో వీర మరణం పొందిన గంగాప్రసాద్ కుటుంబ సభ్యులు గురువారం సభాపతిని కలిశారు.
ఈ సందర్బంగా సభాపతి పోచారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఆర్మీ జవాన్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం, 5 లక్షల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం, ప్రభుత్వ భూమి అందేవిధంగా చూస్తామని కలెక్టర్ తెలిపినట్లు సభాపతి వివరించారు.
అంతేకాకుండా వీర జవాన్ తండ్రి మానసిక వికలాంగుడైనందున అయన స్థానంలో అయన చిన్న కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవిధంగా చూస్తానన్నట్లు సభాపతి పేర్కొన్నారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తదనంతరం సభాపతిని కలిసేందుకు వచ్చిన బాన్సువాడ డివిజన్ రైస్ మిలర్స్ సంఘం తరపున 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, కుమ్మన్ పల్లి సర్పంచ్ కొర్వ గంగాధర్, ఎంపీటీసీ గంగన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బుడిమె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దొడ్ల కాశిరెడ్డి, మహేందర్ రెడ్డి, ఆవుల సంజీవ్, కొర్వ ప్రవీణ్, ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు ఉన్నారు.