పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, యావత్తు సమాజం వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని సూచించారు.

పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ తో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏ ప్రాంతంలోనైతే శాంతిభద్రతలు నెలకొని ఉంటాయో, ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా అందాలంటే శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అనన్యసామాన్యమైనవని కొనియాడారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఎలాంటి విపత్తు సంభవించినా, ముందుగా స్పందించేది పోలీసులేనని గుర్తు చేశారు.

ముంబైలో ఉగ్రవాద దాడి జరిగిన సమయంలోనూ ముందుగా పోలీసులే రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పండుగలు, వీ.వీ.ఐ.పీల పర్యటనలు ఇలా ఏ రకంగా చూసినా పోలీసులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని కలెక్టర్‌ శ్లాఘించారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడం వెనుక పోలీసుల కృషి దాగి ఉందని అన్నారు. మన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో ఎంతో చాకచక్యంగా సైబర్‌ నేరాలను ఛేదిస్తూ, నేరస్థుల ఆటకట్టిస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా 1986 నుండి ఇప్పటివరకు జిల్లాలో విధి నిర్వహణలో నిమగ్నమై అసువులు బాసిన 19 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్‌ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.

పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 19 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు.

అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజ్‌, ఏసీపీ కిరణ్‌ కుమార్‌, సీఐ లు, ఎస్‌.ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »