పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12 (డి) సమర్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్‌ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ శనివారం అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 80 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగులకు, కోవిడ్‌ పాజిటివ్‌ కలిగిన వారికి ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. అదేవిధంగా అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని అన్నారు.

ఎన్నికల కమిషన్‌ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతించిందని తెలిపారు. అయితే పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. నవంబర్‌ 7 వ తేదీ లోపు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్‌ అధికారి నుండి, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్‌ నుండి కూడా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్‌.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్‌ ఓటింగ్‌ సెంటర్‌ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఒకసారి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఇవ్వరని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్‌ బ్యాలెట్‌ కింద మార్కింగ్‌ చేయబడుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, నోడల్‌ అధికారి తిరుమల ప్రసాద్‌, వేణు, అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »