కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తుగా హై రిస్క్‌తో బాధపడుచున్న గర్భిణులను గుర్తించి తగు వైద్య సహాయం అందిస్తూ పర్యవేక్షిస్తుండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ బి.పి, రక్తహీనత, గుండె జబ్బులు తదితర కారణాలవల్ల ప్రసవ సమయంలో తల్లి లేదా బిడ్డ చనిపోతున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యాధికారులకు ప్రతి కేసు పై అవగాహన ఉంటుందని, హై రిస్క్‌తో ప్రాణాపాయ స్థాయిలో ఉన్న గర్భిణులను గుర్తించి సకాలంలో వైద్య పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని, లేకుంటే తల్లి, బిడ్డకు ప్రమాదమని అవగాహన కలిగించాలని సూచించారు. సరైన వైద్య పరీక్షలకు ఇతర ఆసుపత్రులకు సిఫారసు చేస్తే ఫాలో అప్ చేయాలన్నారు.
గర్భిణీ ప్రసవించిన ఒక మాసం వరకు తల్లి, బిడ్డల క్షేమంపై పర్యవేక్షణ చేయాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి నెల 15 న, నెలాఖరున ఇట్టి కేసులపై మానిటరింగ్ చేస్తూ హై రిస్క్ ఉన్న గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా ఆశా వర్కర్లు, ఏ.యెన్.ఏం.లు వారికి అవగాహన కలిగించి ఆసుపత్రులకు తీసుకురావాలన్నారు.
వైద్యాధికారులు తగు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి మరణాలు సంభవించకుండా తల్లి, బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల వేళ ఎవరు రాజకీయ పార్టీల సమావేశాలు, సభలలో పాల్గొనరాదని హితవు చెప్పారు. సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.