కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనల పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతోంది అని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయ మాటలు చెబుతూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నదని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో, దుబ్బాక ఎన్నికల సమయంలో, నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ నియామకాలు అంటూ ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపడుతుందని తెలంగాణలోని ప్రజలందరూ త్వరలోనే టిఆర్‌ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చెవిలో పూలు పెడతారనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగులకు మొండిచెయ్యే మిగిలింది అన్నారు.
ఇటీవలే నిరుద్యోగి తిరుమల్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యని, వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను భర్తీ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు.
కెసిఆర్ కుటుంబంలోని వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు అన్నారు. ఎన్నికల హామీలలో ఇంటికో ఉద్యోగం అని కెసిఆర్ చెప్పి తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో బిసి యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి, సురేష్, వేణు, కాషా గౌడ్, చంద్రకిరణ్, రాజు, సంతోష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.