కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.కే డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన కానిస్టేబుల్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ రాజస్థాన్‌లోని మాధవ్ యూనివర్సిటీలో జంతుశాస్త్రంలో డాక్టరేట్ సాధించిన సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, ఎస్ ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి లు మాట్లాడుతూ కానిస్టేబుల్‌గా ఉండి అత్యున్నత విద్య అయిన జంతుశాస్త్రంలో డాక్టరేట్ సాధించడం నేటి యువతరానికి ఎంతగానో ఆదర్శంగా నిలుస్తుందని, నేటి యువత వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యను చేరుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కానిస్టేబుల్ నుండి డాక్టరెట్ సాధించిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ నిలవడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని, ఉద్యోగాన్ని నిర్వర్తించడమే కాకుండా రక్తదాతగా రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారుడు రమణ, ఉపాధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సంతోష్, పుట్ల సంతోష్, మహేష్ పాల్గొన్నారు.