కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సి -విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా వీడియోలను ఈ యాప్ లో నిర్భయంగా అప్‌లోడ్ చేయవచ్చని, ఫిర్యాదు అందిన వంద నిముషాలలో స్పందించడం జరుగుతుందని అన్నారు.
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సి -విజిల్‌కు ఇప్పటి వరకు వచ్చిన 21 ఫిర్యాదులకు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఓటరు కార్డు, ఓటు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నది తదితర వివరాలకోసం 817 కాల్స్ రాగా అన్నింటికీ సమాధానాలు ఇచ్చామని అన్నారు.
ఎన్నికలకు సంబంధించి ఏదేని సమాచారం, ఫిర్యాదుల కొరకు 24 గంటలు పనిచేసి కంట్రోల్ రూమ్ లోని 1950 కి, సి -విజిల్ కు సమాచారమందించవలసినదిగా కలెక్టర్ కోరారు. ఎన్నికల వేళ నగదు, మద్యం, తాయిలాల ప్రవాహాన్ని అరికట్టుటకు సరిహద్దు చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచామని, ఇప్పటి వరకు 1,54,01,731 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆబ్కారీ, పొలిసు శాఖల ఆధ్వర్యంలో 1,25,19,026 రూపాయల విలువ చేసే 54,935 లీటర్ల మద్యం పట్టుకుని బాధితులపై కేసులు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు.