నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వానాకాలం 2023 – 24 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ ప్రతులను అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్ క్వింటాల్ కు రూ.2203 , సాధారణ రకానికి రూ. 2183 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జగదీశ్, పౌర సరఫరాల శాఖ ఏ.ఎస్.ఓ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.