నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మ నాయక్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మ నాయక్ మాట్లాడుతూ….పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ఓటు వజ్రాయుధం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల మన డెమోక్రసీ ఇంత గట్టిగా నిలబడడానికి కారణం మన రాజ్యాంగమన్నారు.
చాలా దేశాలలో సివిల్ రైట్స్ లేవన్నారు. దేశపౌరునికి దేశం ఇచ్చిన గొప్ప బహుమతి ఓటు హక్కు అని తెలిపారు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకొనే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల ఓటు వివేకంతో, విజ్ఞతతో వేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. మనల్ని పాలించే అవకాశాన్ని మంచి వారికి, సమర్ధులకు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు.భవిష్యత్తులో 30 ఏళ్లు మన దేశాన్ని ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచన ప్రతి ఒక్క యువతీ, యువకుల్లో ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే కీలకమని స్పష్టం చేశారు.
అలాగే జిల్లా స్వీప్ నోడల్ అధికారి సురేష్ మాట్లాడుతూ…. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటును నిజాయితీగా వేయాలని ఎలాంటి బహుమతులు, మద్యం, డబ్బుకు తలొగ్గొద్దని హితవు పలికారు.
అదే విదంగా బోధన్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ…. ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనదని, ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్య వంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.
బహుమతులు ప్రదానం
తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఓటుహక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారుల బృందం తమ పాటలతో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే ఓటు హక్కు ప్రాధాన్యత పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.సురేష్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్ కె రసూల్ బీ, డిఆర్ డిఓ అదనపు పిడి సంజీవ్, కామర్స్ అధ్యాపకులు వినయ్ కుమార్, పలువురు ముఖ్య అధితులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రంగరత్నం, కోఆర్డినేటర్ వీర ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.