ఆర్మూర్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 23వ వారం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు.
కాలనీ వాసులు పారలు, కర్రల సాయంతో మురుగు కాలువలో నిండిన పూడికను, వ్యర్థాలను, ప్లాస్టిక్ కాగితాలను తొలగించి నీరు నిలువకుండా చేశారు. రోడ్ల పక్కన ఇబ్బందికరంగా ఉన్న చెట్ల కొమ్మలను కట్టర్‌తో కత్తిరించారు. రోడ్లపై చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. దాదాపు గంట పాటు శ్రమదానం చేసి మురుగు కాలువలను పరిశుభ్రం చేశారు.
మురుగు కాలువలలో ప్లాస్టిక్ కాగితాలను, వ్యర్థాలను వేయొద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికి అవగాహన కల్పించారు. స్వచ్చ కాలనీ సమైక్య కాలనీ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీని పరిశుభ్రంగా ఉంచడానికి, కాలనీ వాసులలో ఐక్యతను పెంపొందించడానికి గత 23వారాలుగా స్వచ్చ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
పారిశుధ్య లోపం వల్లే వైరల్ జ్వరాలు వస్తున్నాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏ సమస్యలు రావని పేర్కొన్నారు. 25వ వారం పెద్దఎత్తున శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
భక్త హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్, అభివృద్ది కమిటీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ఉపాద్యక్షుడు సుంకే శ్రీనివాస్, కార్యదర్శి కొంతం రాజు, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్ర భూమయ్య, మ్యాకల అశోక్, ఎల్టీ కుమార్, ఎస్సారెస్పి డిఇ గణేష్ తదితరులు పాల్గొన్నారు.