కామారెడ్డి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి నోడల్ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరు కాని వారికి షో కాజ్ నోటీసులు, మెమోలు జారీ చేశామని తెలిపారు.
పోలింగ్ సజావుగా నిర్వహించుటలో పిఓలు, ఏపీవోల పాత్ర కీలకమని అన్నారు. విధులు కేటాయించిన వారికి ఏ కారణాల చేత కూడా మినహాయింపు ఉండదని తప్పక విధులకు హాజరు కావాలని, లేనిచో ఎన్నికల నియమావళి మేరకు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి దశ శిక్షణకు హాజరు కానీ 91 మందికి ఈ నెల 8న ఉదయం ఆయా నియోజకవర్గ కేంద్రాలలో మాస్టర్ ట్రైనీలచే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.
వీరందరికీ ఉత్తర్వులు అందజేయడంతో పాటు, అదర్ పోలింగ్ అధికారులుగా నియమించిన 124 మంది ఐకెపి సిబ్బందికి సమాచారం అందించవలసిందిగా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు రాజారామ్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.