కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్, బాసరలోని ట్రిపుల్ ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈనెల 17న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని, దీనికి 2539 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా సమన్వయకర్త, ఎం.చంద్రకాంత్, సహాయ సమన్వయకర్త బి.శరత్ రెడ్డి పేర్కొన్నారు.
పరీక్ష ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని, అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయన్నారు. 11 మంది పరిశీలకులు, ఇద్దరు రూట్ అధికారులు నియమించబడ్డారని, వీరికి తోడు సాంకేతిక శాఖ నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి ప్రత్యేక పరిశీలకులు అన్ని కేంద్రాలను పర్యవేక్షిస్తారన్నారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలవరకే చేరుకోవాలని, 11 గంటల వరకు లోనికి అనుమతిస్తారని, ఉదయం 11 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయని, తర్వాత ఒక్క నిముషం ఆలస్యమైనా విద్యార్థులను లోనికి అనుమతించరని తెలిపారు. విద్యార్థులు ఎస్.బి.టెట్. యాప్ ద్వారా హాల్ టికెట్ నంబర్ ఆధారంగా పరీక్ష కేంద్రం లొకేషన్ గుర్తించి సులువుగా, సకాలంలో చేరుకోవచ్చన్నారు.
విద్యార్థులు తమ వెంట పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్, హెచ్.బీ పెన్సిల్, పెన్ మాత్రమే తెచ్చుకోవాలని, హాల్ టికెట్‌పై ఫోటో లేని వారు తమ ఫొటో అతికించి ఆటేస్టేషన్ చేయించుకొని రావాలని సూచించారు. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి అనుమతించరని, విద్యార్థులు తమ హాల్ టికెట్‌లో అన్ని వివరాలను సరి చూసుకోవాలని, కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులందరూ మాస్క్ తప్పక ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్, సానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే కేంద్రంలోకి ప్రవేశించాలన్నారు.
అందుకు తగిన ఏర్పాట్లు చేయబడ్డాయని, ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్ట్ ఏర్పాటు చేయబడిరదని, ఆరోగ్య సిబ్బంది కూడా నియమించబడ్డారని, కోవిడ్ సోకిన వారు, లక్షణాలు ఉన్నవారు ముందుగానే పరీక్ష కేంద్రం అధికారికి సమాచారం ఇవ్వాలని, వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయని తెలిపారు.