నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ నాటితో ముగియనున్నందున పోలింగ్ నిర్వహణ కోసం ఈ.వీ.ఎం లను సిద్ధం చేసుకోవాలని అన్నారు.
ఇప్పటికే మొదటి ర్యాండమైజెషన్ ద్వారా ఈ.వీ.ఎంలను శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు తరలించడం జరిగిందని, ఈ నెల 18 న సెకండ్ ర్యాండమైజెషన్ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన మీదట అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా బ్యాలెట్ పత్రాల ముద్రణలోనూ తప్పిదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు.
అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట, వారి సంఖ్యకు అనుగుణంగా ఈవీఎంలను వినియోగించాలని సీఈఓ సూచించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన పనులు ఏమిటీ, చేయకూడనివి ఏమిటీ అనే అంశాలపై పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న వారందరికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. వెబ్ క్యాస్టింగ్ కోసం ఎంపిక చేసిన వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.
తనిఖీల సందర్భంగా నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసే సమయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని హితవు పలికారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, దివ్యంగుల ఇళ్లకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని సీఈఓ సూచించారు.
సువిధ యాప్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ నిబంధనలకు లోబడి ఉన్న వాటికి నిర్ణీత గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని, అనుమతుల జారీలో జాప్యం చేయరాదని సూచించారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. 1950 టోల్ ఫ్రీ, సి.విజిల్, కంట్రోల్ రూమ్ ల ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.
ఫారం-6 , ఫారం-8 ల బదలాయింపు ప్రక్రియను నిరంతంరం పర్యవేక్షిస్తూ దరఖాస్తులు పెండిరగ్ లో లేకుండా చూసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.