కామారెడ్డి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో ఈనెల 31 వరకు ప్రస్తుతం ఉన్న వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌లో జరిగింది. సమావేశంలో అత్యధిక మెజారిటీ సభ్యులు హైకోర్టు ఆదేశాలు ఈ నెల 31 వరకు ఉన్నందున వర్చువల్ విధానమే శిరోధార్యమని పేర్కొన్నారు.
ఇరువర్గాలు రెడీగా ఉన్న కేసులు, బెయిల్ దరఖాస్తులు, చెక్కుల దరఖాస్తులు, అవుట్ అఫ్ ఆర్డర్‌లు, యధావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర కేసులలో తమ న్యాయవాదిని సంప్రదించి మాత్రమే కోర్టుకు రావాలని, లేనిపక్షంలో కక్షిదారులు కోర్టులకు రావలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కోవిడ్ డెల్టా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఇట్టి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్‌లో నూతనంగా సభ్యత్వం తీసుకున్న న్యాయవాది రంజిత్ మోహన్ పరిచయ కార్యక్రమం జరిగింది. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జె గంగాధర్, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శి దేవుని సూర్య ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.