కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు వీలుగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య విజ్ఞప్తి చేశారు.
భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి పట్టణంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓటరు అవగాహనపై ట్రాన్సజెండర్లు , వయోవృద్ధులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం 18 ఏళ్ళు నిండిన అందరికి ఓటు హక్కు కల్పించిందని, వృద్దులు, అంధులు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్, వీల్ చైర్, వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
బాధ్యత గల పౌరులుగా తప్పక ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి నరేష్, సిడిపిఓ శ్రీలత, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.