నిజామాబాద్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ యాప్ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీ.ఈ.ఓ లోకేష్ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. సువిధ యాప్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిబంధనలకు లోబడి ఉన్న వాటికి నిర్ణీత గడువులోపు అనుమతులు జారీ చేసేలా చొరవ చూపాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1429 దరఖాస్తులు పెండిరగ్లో ఉన్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా సి-విజిల్ యాప్ లో వచ్చే ఫిర్యాదుల పైనా సత్వరమే స్పందించాలని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలకు పాల్దినట్లు నిర్ధారణ అయినా వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఈ నెల 15 న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కానున్నందున, తదుపరి ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయి ఉండాలని అన్నారు. ముఖ్యంగా అభ్యర్థుల పేర్లు, వారికి గుర్తుల కేటాయింపులు, కమిషనింగ్ తదితర ప్రక్రియల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఈ నెల 18 న ఈ.వీ.ఎం ల రెండవ విడత ర్యాండమైజెషన్ పూర్తి చేసుకోవాలని, అలాగే పోలింగ్ సిబ్బంది ర్యాండమైజెషన్ ను కూడా చేపట్టాలని అన్నారు. జూమ్ మీటింగ్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఈ.డీ.ఎం కార్తిక్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది శ్రీనివాస్, పవన్ , రషీద్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.