నిజామాబాద్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని వివరించారు.
ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 128 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 102 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 21మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు.
బోధన్ నియోజకవర్గంలో 15మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, 8 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. బాన్సువాడ సెగ్మెంట్లో 17మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో 23మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, 8 మంది అభ్యర్థులవి తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు అవగా, ఒకరి నామినేషన్ తిరస్కరించబడిరదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని, ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు.