కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి సందర్శించి 1950 ద్వారా, సి-విజిల్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా వాహనాలు తిరుగుతున్న, సభలు, సమావేశాలు, ర్యాలు నిర్వహిస్తున్న, లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తున్న, డబ్బు,మద్యం,కానుకలు పంపిణి చేస్తున్న, అనుమతులు లేకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు వస్తున్నా ఎన్నికల నియమావళిని ఉల్లంఘన క్రిందికి వస్తాయని, ఎన్నికల కమీషన్ ఉల్లంఘన, ఫిర్యాదులపట్ల చాలాలోతుగా గమనిస్తున్నదని అన్నారు.
1950 ద్వారా ఎపిక్ కార్డులు, ఎన్నికల నియమావళి ఉలంఘిస్తూ నిర్వహిస్తున్న ప్రచారాలు, డబ్బు, మద్యం పంపిణి వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను విడివిడిగా నమోదు చేస్తూ సంబంధిత నోడల్ అధికారులకు తెలపాలన్నారు. స్టాస్టిక్ సర్వేలెన్స్ టీజీమ్‌లు చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా పెంచాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ నియోజక వర్గ పరిధిలో తిరుగుతూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే అక్కడికి చేరుకొని సీజ్ చేయాలనీ అన్నారు.
అభ్యర్థులు ప్రచారం కోసం చేస్తున్న ప్రతి ఖర్చును నమోదు చేయడమే ఎన్నికల సంఘం ఉద్దేశ్యమని అన్నారు. పోలింగ్ రెండు రోజుల ముందు చాలా కీలకమని, సామాజిక మాధ్యమాలలో వచ్చే అసత్య వార్తలకు తక్షణమే స్పందిస్తూ వైరల్ కాకుండా వెంటనే నిలుపుదలకు చర్యలు తీసుకుంటూ వాస్తవాలను మీడియా ద్వారా తెలపాలని, సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సింహ రావు, సురేందర్ కుమార్, సతీష్ యాదవ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సాయి భుజంగం తదితరులు పాల్గొన్నారు.