నిజామాబాద్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాక్లూర్ మండలం మాదాపూర్ లో గల ఐ.ఎం.ఎల్ (మద్యం నిల్వల) గోడౌన్‌ను ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్లకు ఎంత పరిమాణంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి. ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయి తదితర వివరాలను ఎక్సయిజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మద్యం నిల్వల కేటాయింపులు, అమ్మకాల వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. పోలింగ్‌కు సమయం సమీపించిన దరిమిలా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నందున గట్టి నిఘా కొనసాగించాలని అబ్జర్వర్ శక్తి సూచించారు.
ముఖ్యంగా సాధారణ సమయాలకంటే ప్రస్తుతం పెద్ద మొత్తంలో మద్యం దిగుమతులు జరిగిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిఘా బృందాలతో పాటు సంబంధిత అధికారులకు హితవు పలికారు. అబ్జర్వర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఎక్సయిజ్ డిప్యూటి కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.