కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలిస్తూ అకౌంటింగ్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పర శివమూర్తి జిల్లా యంత్రాంగానికి సూచించారు.
సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తో కలిసి ఏం.సి.ఏం.సి., సోషల్ మీడియా, వ్యయ నోడల్ అధికారులతో మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని, ప్రతి ఖర్చును లెక్కించాలన్నారు. ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందారా లేదా పరిశీలించాలని అన్నారు.
ప్రధానంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలను 24 గంటలు నిశితంగా పరిశీలిస్తూ అనుమతులు లేనట్లయితే నోటీసులు ఇచ్చి ఖర్చు బుక్ చేయాలన్నారు. వ్యయ నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ పక్కాగా సాక్ష్యాధారాలతో ఖర్చును షాడో రిజిస్టర్‌లో నమోదు చేయాలని, అట్టి వివరాలు అభ్యర్థి ఖర్చు రిజిస్టర్ తో రీ-క్యాన్సిల్ చేసుకోవాలన్నారు.
సమావేశంలో ఏం.సి.ఏం.సి. కమిటీ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి, సతీష్ యాదవ్, శాంతి కుమార్, ప్రవీణ్, నోడల్ అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు