బాన్సువాడ, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో భుజంగరావు అన్నారు. సోమవారం బాన్సువాడ శ్రీ రామ్ నారాయణ్ కేడియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డిఓ భుజంగరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన యువతి, యువకులకు ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిన అభ్యర్థిని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ఓటు వజ్రాయుధమని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరమని ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకొనే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల ఓటు వివేకంతో, విజ్ఞతతో వేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. మనల్ని పాలించే అవకాశాన్ని మంచి వారికి, సమర్ధులకు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. భవిష్యత్తులో 30 ఏళ్లు మన దేశాన్ని ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచన ప్రతి ఒక్క యువతీ, యువకుల్లో ఉండాలన్నారు.
ఓటును నిజాయితీగా వేయాలని ఎలాంటి బహుమతులు, మద్యం, డబ్బుకు తలొగ్గొద్దని హితవు పలికారు. అనంతరం నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శైలీ బెల్లాల్ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనదని, ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్య వంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.
బహుమతులు ప్రదానం
ఓటుహక్కుపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, దేశభక్తి గేయాల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శైలీ బెల్లాల్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, స్వీప్ నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ జనార్ధన్, మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాస్, అధ్యాపక బృందం కృష్ణ, జి సుధాకర్ రెడ్డి, మనోహర్, జిల్లా శాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.