కోరుట్ల, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్ జెఏసి నాయకుడు కిరణ్ కుమార్ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్. గార్డెన్స్ లో మంగళవారం జరిగిన గల్ఫ్ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో గల్ఫ్ వలస కార్మికులు పాత్ర ముఖ్యమైనదని అన్నారు. అప్పుడు గల్ఫ్ దేశాలలో ఉన్నవారు గ్రామాలలో ఉన్న తమ కుటుంబాలను ఉద్యమంలో పాల్గొనాలని ప్రోత్సహించారు. ఇప్పుడు గల్ఫ్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఫోన్లు చేసి చెబుతున్నారని కిరణ్ అన్నారు.
గల్ఫ్ మృతుల ఆత్మశాంతి కోసం సభ మౌనం పాటించింది. కోరుట్ల అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు హామీలతో కూడిన బాండ్ పేపర్ ను విడుదల చేశారు. అంతకుముందు మెటుపల్లి నుంచి కోరుట్ల వరకు గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు మెటుపల్లిలో కాసేపు ర్యాలీని నిలిపివేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పర్మిషన్ పత్రం చూపించిన తర్వాత వదిలేశారు.
ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న గల్ఫ్ సంఘాల నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని గల్ఫ్ కార్మికు నాయకుడు మంద భీంరెడ్డి కోరారు. సిరిసిల్ల దొనికెని క్రిష్ణ ఇండిపెండెంట్‌గా టీవీ రిమోట్ గుర్తుతో బరిలో ఉన్నారు. నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్లపై సింహం గుర్తుతో నాలుగు నియోజకవర్గాల్లో గల్ఫ్ లీడర్స్ రంగంలో ఉన్నారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), గల్ఫ్ కార్మికులు, చెరుకు రైతులు, బీడీ కార్మికుల ఉమ్మడి అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల), ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్), గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంత (ధర్మపురి) నుంచి పోటీలో ఉన్నారని వీరందరికి గల్ఫ్ కుటుంబాలు మద్దతు తెలువుతున్నాయని భీంరెడ్డి అన్నారు.
గల్ఫ్ కార్మికుల ప్రోత్సాహంతో తాను కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నానని చెన్నమనేని శ్రీనివాస్ రావు అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని సౌదీ అరేబియా, యూఏఈ (దుబాయి), ఓమాన్ (మస్కట్), కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి గ్రామాలలోని వారి కుటుంబ సభ్యులకు పెద్దఎత్తున వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్‌లతో ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదం స్పూర్తితో, రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లును ఆయుధాలుగా మార్చుకొని ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నామని నిర్మల్ అభ్యర్థి స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారు, గల్ఫ్ రిటనీలు కలిసి గ్రామ ప్రవాసి వాట్సప్ గ్రూపుల ద్వారా రాజకీయంగా సంఘటితమవుతున్నారని వేములవాడ అభ్యర్థి గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. గల్ఫ్ దేశాల నుంచి గ్రామాల వరకు వీస్తున్న రాజకీయ గాలికి ప్రధాన రాజకీయ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ధర్మపురి అభ్యర్థి బూత్కూరి కాంత అన్నారు. స్వయంగా సభకు హాజరు కాలేకపోయిన సిరిసిల్ల అభ్యర్థి దొనికెని క్రిష్ణ ఒక సందేశం పంపారు. గరీబు గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం ఎన్నికల్లో పోటీ చేయడమే గెలువుతో సమానమని ఆయన అన్నారు.
గల్ఫ్ సంఘాల నాయకులు తోట ధర్మేందర్, గాంధారి సత్యనారాయణ, గంగుల మురళీధర్ రెడ్డి, ఎలిగేటి రఘు, బీరెల్లి తిరుమల్ రావు, ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకురాతి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.