నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించిన నివేదికలను అందించడంలో తాత్సారం చేయకుండా సకాలంలో పంపించాలని హితవు పలికారు. ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగులకు వారివారి ఇళ్ల వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లు, పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టిన కసరత్తులు గురించి ఆరా తీశారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 60 శాతం వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని సీఈఓ సూచించారు.
నూతన ఓటర్లకు పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, వాటి వివరాలను సమర్పించాలని అన్నారు. జిల్లాలో ప్రతి ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని, ప్రతి రోజూ ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై నివేదిక అందించాలని, ప్రతి రోజూ నోడల్ అధికారి ద్వారా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పై రివ్యూ నిర్వహించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేసి, ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వారికి అవసరమైన శిక్షణ అందించారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవిఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని హితవు పలికారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిర్ణీత గడువులో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందిస్తూ, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ రిటర్నింగ్ అధికారులు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.