నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్ధమయ్యే రీతిలో వివరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. ఆర్మూర్ శాసనసభా నియోజకవర్గ ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సుబ్రాచక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఫెసిలిటేషన్ సెంటర్లు, పీ.ఓలు, ఏ.పీ.ఓలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోప్యతను పాటించేలా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారా, పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన నిర్ణీత ఫారంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించారు. హాజరు పట్టికను తనిఖీ చేసి, శిక్షణ తరగతులకు గైర్హాజర్ అయిన పీ.ఓ, ఏ.పీ.ల నుండి కారణాలు అడిగి తెలుసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి ఒక్కరు శిక్షణ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని పోలింగ్ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.