నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్, పిప్రి తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి శనివారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి స్థానికులను, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొని ఉందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అబ్జర్వర్ శక్తి అధికారులకు సూచించారు. శాంతియుత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని, ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అబ్జర్వర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు.