పూర్తయిన కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ జరిపారు.

నిజామాబాద్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను డిసెంబర్‌ 3వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా, బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్కించనున్నారు. ఈ మేరకు కౌంటింగ్‌ సిబ్బందిని ర్యాండమైజెషన్‌ ద్వారా ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఖరారు చేశారు.

ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్‌ ద్వారా చూపించారు. ర్యాండమైజెషన్‌ ద్వారా ఖరారైన జాబితాను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ఎంపికైన సిబ్బందికి సోమవారం శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు.

రెండవ విడత ర్యాండమైజెషన్‌ పూర్తయిన మీదట ఆ జాబితా ఆధారంగా జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని కేటాయిస్తామని అన్నారు.

ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్‌ లో ఉంచుతూ మొత్తం 412 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించామని వివరించారు. వీరిలో 143మంది సూపర్వైజర్లు, 143 మంది అసిస్టెంట్‌ సూపర్వైజర్లు, 126 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు.

ర్యాండమైజెషన్‌ ప్రక్రియలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, సీపీఓ బాబూరావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »