కామారెడ్డి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలలో కామారెడ్డి, జుక్కల్, ఎలారెడ్డి నియోజక వర్గాల నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 29, 30 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తు అనుమతి పొందవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయపరమైన ప్రకటనలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని స్పష్టం చేశారు. చివరి క్షణంలో జారీ చేసే రాజకీయ ప్రకటనలు ఓటర్లను తప్పుదారి పట్టించిన సందర్భాలలో బాధిత అభర్ధులు అటువంటి ప్రకటనలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉండదని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఆవేశపూరితంగా, తప్పుదారి పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనలతో ఓటర్లు ప్రభావితంకాకుండా ఉండేందుకు రాజ్యాంగంలోని 324 నిబంధన ననుసరించి భారత ఎన్నికల సంఘం ఈ నిర్ణయం చేసిందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ రోజు, పోలింగ్ రోజుకు ఒక రోజు ముందు ప్రింట్ మీడియా ప్రకటనల (కంటెంట్) ను జిల్లా ఎంసిఎంసికి రెండు రోజుల ముందు నుంచి సమర్పించి ధ్రువీకరింపచేసుకోవలన్నారు. అభ్యర్థులు తక్షణమే ముందస్తు ఆమోదం పొందేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేసారు.