నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఏర్పాట్లలో ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు సీఎస్‌ఐ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను కలెక్టర్ మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, ఇతర రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేసిన ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం సరిపడా సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేందుకు వీలుగా వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సామాగ్రి పంపిణీ సమయంలోనే ఈ.వీ.ఎం ల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్ ప్రకారంగా పోలింగ్ సామాగ్రిని కట్టుదిట్టమైన భద్రత నడుమ సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లేలా పర్యవేక్షణ జరపాలని, పొరపాట్లకు తావిచ్చి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూంలను పరిశీలించి పలు మార్పులు, చేర్పులను సూచించారు.
ప్రధానంగా, భద్రతాపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిసి కెమెరాలను అమర్చి, బందోబస్తు సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కేటాయించే గదులలో మానిటర్లను అమర్చి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు.
తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, ఓటింగ్ పూర్తయిన మీదట తిరిగి పోల్డ్ ఈవీఎం లు స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం, అనంతరం చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలన్నీ ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.