అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్‌ సిబ్బంది సెకండ్‌ ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా శనివారం కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్‌ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ పూర్తయిన మీదట కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ.వీ.ఎంలను ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్‌ కళాశాలలకు తరలించి సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌ లలో భద్రపర్చారు. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత రాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు.

ఆరు సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్‌ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్‌ ట్రైనర్స్‌ చే కౌంటింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరిశీలకుల దృష్టికి తెచ్చారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుకై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ, రౌండ్ల వారీగా కౌంటింగ్‌ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఆర్మూర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో, బోధన్‌ 18 రౌండ్లలో, బాన్సువాడ 19 రౌండ్లు, నిజామాబాద్‌ అర్బన్‌ 21 రౌండ్లు, నిజామాబాద్‌ రూరల్‌ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గ ఓట్లను 18 రౌండ్లలో లెక్కించడం జరుగుతుందని వివరించారు.

కాగా, మూడవ విడత కౌంటింగ్‌ సిబ్బంది రాండమైజేషన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్టారని కలెక్టర్‌ తెలిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్‌ సిబ్బందిని ఆయా టేబుళ్లకు ఓట్ల లెక్కింపు కోసం కేటాయిస్తారని వివరించారు.

ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజెషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, సీపీఓ బాబూరావు, ఎన్‌ ఐ సి అధికారి రవికుమార్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »