ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్‌ శనివారం పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్‌ సెంటర్లను పరిశీలించారు.

ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. కౌంటింగ్‌ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, బారికేడ్లు, సిసి కెమెరాలు, స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కలెక్టర్‌ తన ఛాంబర్‌లో ఆరు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఉదయం 5.00 గంటలకు పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్‌ సిబ్బంది మూడవ విడత రాండమైజేషన్‌ జరిపించాలని ఆర్‌.ఓలకు మార్గనిర్దేశం చేశారు.

నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్నివిధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్షీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు.

ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్‌ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్‌ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్‌ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పాసులు అందించాలని, పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్‌ సెంటర్‌ లోనికి అనుమతించాలని సూచించారు.

అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను సరిచేసుకోవాలని, సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, అవసరమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

కాగా, కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన మీదట అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలను సీల్‌ చేసి జిల్లా కేంద్రంలోని గోడౌన్‌ కు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. కాగా, ఆరు సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్‌ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్‌ ట్రైనర్స్‌ చే కౌంటింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు.

రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుకై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ, రౌండ్ల వారీగా కౌంటింగ్‌ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో పూర్తి కానుండగా, బోధన్‌ 18 రౌండ్లలో, బాన్సువాడ 19 రౌండ్లు, నిజామాబాద్‌ అర్బన్‌ 21 రౌండ్లు, నిజామాబాద్‌ రూరల్‌ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గ ఓట్లను 18 రౌండ్లలో లెక్కించడం జరుగుతుందని వివరించారు.

కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాల సంస్థ కమిషనర్‌ ఎం.మకరందు, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజా తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »