పాఠకులే కవిత్వానికి కోట

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పాఠకులే కవిత్వానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, పాఠకులను మెప్పించే కవిత్వం రాయడం నిబద్ధతతోనే సాధ్యమని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త డాక్టర్‌ అమృత లత అన్నారు. సోమవారం నిజామాబాద్‌ శివారులోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌లో జరిగిన సరస్వతీ రాజ్‌ – హరిదా పురస్కార సభ, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు.

ఆమె మాట్లాడుతూ కవిత్వంలో భావ కవిత్వం, ప్రణయకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వేటికవే సమాజాన్ని చైతన్య దిశలో నడిపాయని ఆమె అన్నారు. హరిదా రచయితల సంఘం రాష్ట్రస్థాయి కార్యక్రమాలను నిర్వహించడంలో తనదైన ముద్ర వేసిందని, హరిదా అంటే బలమైన సాహిత్య వేదిక అని అభినందించారు.

గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్య మూలాలను తెలుసుకోవాలంటే నిజామాబాద్‌ జిల్లా వైపు చూడాలని పరిశోధకుల అభిప్రాయం అని తెలిపారు. అస్మకజనపదం నాటి నుండి గొప్ప నాగరికత, చరిత్ర, సాహిత్యం ఇక్కడి ప్రజల జీవితంలో భాగమైందని సోదాహరణంగా వివరించారు. మనిషిని మనిషిలాగా జీవించేటట్టు దారి చూపేది కవిత్వమని ఆయన అభివర్ణించారు.

సభకు అధ్యక్షత వహించిన హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ కవులు కవయిత్రులు అనధికార శాసనకర్తలని, వారు నిజాయితీగా వ్యవహరించి సమాజానికి మేలు చేసి రుణం తీర్చుకోవాలని కోరారు. పురస్కారాల ప్రదాత నవ్య భారతి విద్యాసంస్థల చైర్మన్‌ క్యాతం సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే వారిని మంచి పాఠకులుగా తీర్చిదిద్దాలని ఆ బాధ్యత తల్లిదండ్రులు గురువులు స్వీకరించాలని కోరారు. సంస్కారాన్ని కాక సమాజంలో ఎదురయ్యే అనేక కష్టాలను అధిగమించడానికి పుస్తక పఠనం దోహదపడుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా హరిదా రచయితల సంఘం అందిస్తున్న ‘‘ సరస్వతీ రాజ్‌-హరిదా ప్రతిభా మూర్తి పురస్కారం’’ డాక్టర్‌ అమృతలతకు అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 52 మంది కవులు, కవయిత్రులు కవిత గానం చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌, దారం గంగాధర్‌, అనిల్‌ బత్తుల, కాసర్ల నరేశ్‌ రావు, తిరుమల శ్రీనివాస్‌ ఆర్య, కంకణాల రాజేశ్వర్‌, సూరారం శంకర్‌, మద్దుకూరి సాయిబాబు, సిరిగాద శంకర్‌, ఎం కవిత, డాక్టర్‌ చీదెళ్ళ సీతాలక్ష్మి, మూర్తి, తాడూరి ప్రవీణ్‌, కళ్లెం నవీన్‌ రెడ్డి, వసంత లక్ష్మణ్‌, రేణుక , తల్లా వజ్జల మహేష్‌ బాబు, డాక్టర్‌ వెంకన్న గారి జ్యోతి, ఎం ఏ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు. కవితా పఠనం చేసిన సాహితిమూర్తులను ఘనంగా సత్కరించారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »