నిజామాబాద్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక భవన్, కోటగల్లిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోతున్న రాష్ట్ర ప్రభుత్వ హామీలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాల కృష్ణ, కే.సూర్యం మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కడం, అంతులేని అహాంకారం, అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలు అనుసరించడం, ముఖ్యంగా కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్లనే ఓటర్లు టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు పరాజయం, పరాభవం ఇచ్చారన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం, కనీస వేతనాలు కూడా అమలు చేయకపోవడం కేసీఆర్ సర్కార్ వైఫల్యం అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ సర్కారుకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కార్మికులు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ముఖ్యంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు తమ వేతనాల పెంపు ఇతర సమస్యలను పరిష్కరిస్తుందని కొత్త ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పరుచుకున్నారన్నారు. వీరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న జిల్లా సహాయ కార్యదర్శులు బీ.మల్లేష్, ఆర్. రమేష్, జిల్లా కోశాధికారి రవి జిల్లా నాయకులు కిషన్, సత్యక్క, మురళి, సాయరెడ్డి, విఠల్, కిరణ్, లక్ష్మి, బిపాషా, రాజన్న తదితరులు పాల్గొన్నారు.