నిజామాబాద్, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.